యెహోషువ 22:9-31

యెహోషువ 22:9-31 TELUBSI

కాబట్టి రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును యెహోవా మోషేద్వారా సెలవిచ్చిన మాటచొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్యభూమి యైన గిలాదులోనికి వెళ్లుటకు కనాను దేశమందలి షిలో హులోనున్న ఇశ్రాయేలీయుల యొద్దనుండి బయలుదేరిరి. కనానుదేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చి నప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధ గోత్రపువారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీయుల యెదుటివైపున యొర్దానుప్రదేశములో కనానుదేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీయులకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధగోత్రపువారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని, అనగా పదిమంది ప్రధానులను అతనితోకూడ పంపిరి, వారందరు ఇశ్రాయేలీయుల సమూహములలో తమతమపితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదుదేశములోనున్న రూబేనీయుల యొద్దకును గాదీయుల యొద్దకును మనష్షే అర్ధ గోత్రపువారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి –యెహోవా సర్వ సమాజపువారు చెప్పుచున్నదేమనగా–నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని, ఇశ్రాయేలీయుల దేవుని మీద మీరేల తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను గదా నేటివరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడినుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగబడి ద్రోహము చేసెదరేమి? ఆలాగైతే ఆయన ఇకమీదట ఇశ్రాయేలీయుల సర్వసమాజముమీద కోపపడును గదా? మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండినయెడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మామధ్యను స్వాస్థ్యము తీసికొనుడి, మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగబడకుడి, మా మీద తిరుగబడకుడి, జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దానివిషయములో తిరుగబడినప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మీదికి కోపము రాలేదా? తన దోషమువలన ఆ మనుష్యుడొకడే మరణమాయెనా? అందుకు రూబేనీయులును గాదీయులును మనష్షే అర్ధగోత్రపువారును ఇశ్రాయేలీయుల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా –దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు; సంగతి ఆయనకు తెలియును, ఇశ్రాయేలీయులు తెలిసికొందురు, ద్రోహము చేతనైనను యెహోవామీద తిరుగుబాటుచేతనైనను మేము ఈ పని చేసినయెడల నేడు మమ్ము బ్రదుకనియ్యకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి, దహనబలినైనను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకేగాని సమాధానబలులను దానిమీద అర్పించుటకేగాని మేము ఈ బలిపీఠమును కట్టినయెడల యెహోవా తానే విమర్శచేయునుగాక. వేరొక హేతువుచేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా రాబోవుకాలమున మీ సంతానపు వారు మా సంతానపువారితో–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెనుగదా యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుటవలన మీ సంతానపువారు మా సంతానపువారిని యెహోవా విషయములో భయభక్తులులేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువుచేతనే దీని చేసితిమి. కాబట్టి మేము–మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పు కొంటిమి; అది దహనబలులనర్పించుటకైనను బలినర్పిం చుటకైనను కాదు. మన దహనబలుల విషయములోను బలుల విషయములోను సమాధానబలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవచేయవలయు ననుటకు–యెహోవాయందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతివారు మా సంతతివారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన మన తరములవారికిని మధ్య సాక్షియైయుండును. అందుకు మేము–ఇకమీదట వారు మాతోనేగాని మా తరముల వారితోనేగాని అట్లు చెప్పినయెడల మేము–మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి; యిది దహనబలినర్పించుటకు కాదు బలినర్పించుటకు కాదు గాని, మాకును మీకును మధ్యసాక్షియై యుండుటకే యని చెప్పుదమని అనుకొంటిమి. ఆయన మందిరము నెదుట నున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహనబలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయినయెడలనేమి యెహోవామీద ద్రోహము చేసినయెడలనేమి మేము శాపగ్రస్తులమగుదుము గాక. ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోను గాదీయులతోను మనష్షీయులతోను–మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము; ఇప్పుడు మీరు యెహోవా చేతిలోనుండి ఇశ్రాయేలీయులను విడిపించియున్నారని చెప్పెను.