యెహోషువ 15:1-19

యెహోషువ 15:1-19 TELUBSI

యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్లవలన వచ్చినవంతు ఎదోము సరిహద్దువరకును, అనగా దక్షిణదిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతమువరకును ఉండెను. దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్రతీరమున దక్షిణదిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను. అది అక్రబ్బీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీనువరకు పోయి కాదేషు బర్నేయకు దక్షిణముగా ఎక్కి హెస్రోనువరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయువైపు తిరిగి అస్మోనువరకు సాగి ఐగుప్తు ఏటివరకు వ్యాపించెను. ఆతట్టు సరిహద్దు సముద్రమువరకు వ్యాపించెను, అది మీకు దక్షిణపు సరిహద్దు. దాని తూర్పు సరిహద్దు యొర్దాను తుదవరకు నున్న ఉప్పు సముద్రము. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను తుద నున్న సముద్రాఖాతము మొదలుకొని వ్యాపించెను. ఆ సరిహద్దు బేత్‍హోగ్లావరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కువరకు వ్యాపించెను. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాతివరకు వ్యాపించెను. ఆ సరిహద్దు ఆకోరులోయనుండి దెబీరువరకును ఏటికి దక్షిణతీరముననున్న అదుమ్మీము నెక్కుచోటికి ఎదురుగా నున్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తరదిక్కు వైపునకును వ్యాపించెను. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకు వ్యాపించెను. దాని కొన ఏన్‌రోగేలునొద్ద నుండెను. ఆ సరిహద్దు పడమట బెన్‌హిన్నోములోయ మార్గముగా దక్షిణదిక్కున యెబూసీయుల దేశమువరకు, అనగా యెరూషలేమువరకు నెక్కెను. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగానున్న కొండ నడికొప్పువరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ తుదనున్నది. ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పునుండియు నెఫ్తోయ నీళ్లయూటయొద్దనుండియు ఏఫ్రోనుకొండ పురములవరకు వ్యాపించెను. ఆ సరిహద్దు కిర్యత్యారీమను బాలావరకు సాగెను. ఆ సరిహద్దు పడమరగా బాలానుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీముకొండయొక్క ఉత్తరపు వైపునకుదాటి బేత్షెమెషువరకు దిగి తిమ్నావైపునకు వ్యాపించెను. ఉత్తరదిక్కున ఆ సరిహద్దు ఎక్రోనువరకు సాగి అక్కడనుండిన సరిహద్దు షిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి యబ్నెయేలువరకును ఆ సరిహద్దు సముద్రమువరకును వ్యాపించెను. పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దువరకు వ్యాపించెను. యూదా సంతతివారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యూదా వంశస్థులమధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్తయైన అర్బాయొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడనుండి కాలేబు అనాకుయొక్క ముగ్గురు కుమారులైన షెషయి అహీమాను తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్లగొట్టి వారిదేశమును స్వాధీనపరచుకొనెను. అక్కడనుండి అతడు దెబీరు నివాసులమీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్సేఫెరు. కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని దానిని కొల్లపెట్టిన వానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజు కుమారుడునైన ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక అతడు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను. మరియు ఆమె తన పెనిమిటి యింటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి–నీకేమి కావలెనని ఆమె నడిగెను. అందుకామె–నాకు దీవెన దయచేయుము; నీవు నాకు దక్షిణభూమి యిచ్చియున్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.