యోనా 3:1-10

యోనా 3:1-10 TELUBSI

అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా –నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణమునకు పోయెను. నీనెవె పట్టణము దేవునిదృష్టికి గొప్పదై మూడుదినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంతదూరము సంచరించుచు–ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నీనెవె రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి, తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులును ఆజ్ఞ ఇయ్యగా –ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులుగాని యెద్దులుగాని గొఱ్ఱెలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, మనుష్యులందరు తమ దుర్మార్గములను విడిచి తాముచేయు బలాత్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.