యోబు 4

4
1దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తర
మిచ్చెను–
2ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల
నీకు వ్యసనము కలుగునా?
అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?
3అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు
బలహీనమైన చేతులను బలపరచినవాడవు.
4నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.
క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.
5అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి
అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.
6నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?
నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
7జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు
ఎప్పుడైన నశించెనా?
యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?
8నేను చూచినంతవరకు అక్రమమును దున్ని
కీడును విత్తువారు దానినే కోయుదురు.
9దేవుడు ఊదగా వారు నశించుదురు
ఆయన కోపాగ్ని శ్వాసమువలనవారు లేక పోవుదురు.
10సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.
కొదమ సింహముల కోరలును విరిగిపోవును.
11ఎర లేనందున ఆడుసింహము నశించును
సింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.
12నా కొకమాట రహస్యముగా తెలుపబడెను
నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు
వినబడెను.
13గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున
రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.
14భయమును వణకును నాకు కలిగెను
అందువలన నా యెముకలన్నియు కదిలెను.
15ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా
నా శరీర రోమములు పులకించెను.
16అది నిలువబడగా దాని రూపమును నేను
గురుతుపట్టలేక పోతిని
ఒక రూపము నా కన్నులయెదుట నుండెను
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని
ఏమనగా–దేవుని సన్నిధిని మర్త్యులు
నీతిమంతులగుదురా?
17తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?
18ఆయన తన సేవకులను నమ్ముటలేదు
తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.
19జిగటమంటి యిండ్లలో నివసించువారియందు
మంటిలో పుట్టినవారియందు
చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి
ఎన్ని కనుగొనును?
20ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు
ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.
21వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.
ఆలాగుననే జరుగుచున్నది గదా.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యోబు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి