యోహాను 9:6-27

యోహాను 9:6-27 TELUBSI

ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మివేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నులమీద ఆ బురద పూసి –నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచినవారును–వీడు కూర్చుండి భిక్ష మెత్తుకొనువాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడుకాడు, వీని పోలియున్న యొకడని మరికొందరును అనిరి; వాడైతే–నేనే యనెను. వారు–నీ కన్నులేలాగు తెరవబడెనని వానినడుగగా వాడు–యేసు అను నొక మనుష్యుడు బురద చేసి నా కన్నులమీద పూసి–నీవు సిలోయమను కోనేటికి వెళ్లి కడుగుకొనుమని నాతో చెప్పెను; నేను వెళ్లి కడుగుకొని చూపు పొందితిననెను. వారు, ఆయన ఎక్కడనని అడుగగావాడు, నేనెరుగననెను. అంతకుముందు గ్రుడ్డియైయుండినవానిని వారు పరిసయ్యులయొద్దకు తీసికొనిపోయిరి. యేసు బురదచేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతిదినము వాడేలాగు చూపుపొందెనో దానినిగూర్చి పరిసయ్యులు కూడ వానిని మరల అడుగగా వాడు–నా కన్నులమీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితినని వారితో చెప్పెను. కాగా పరిసయ్యులలో కొందరు–ఈ మనుష్యుడు విశ్రాంతిదినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్దనుండి వచ్చినవాడు కాడనిరి. మరికొందరు–పాపియైన మనుష్యుడు ఈలాటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి; ఇట్లు వారిలో భేదము పుట్టెను. కాబట్టి వారు మరల ఆ గ్రుడ్డివానితో అతడు నీ కన్నులు తెరచినందుకు నీవతనిగూర్చి యేమను కొనుచున్నావని యడుగగా వాడు–ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డి వాడైయుండి చూపు పొందెనని యూదులు నమ్మక, చూపు పొందినవాని తలిదండ్రులను పిలిపించి, –గ్రుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? ఆలాగైతే ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తలిదండ్రులు–వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడుగా పుట్టెననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడేలాగు చూచుచున్నాడో యెరుగము; ఎవడు వీని కన్నులు తెరచెనో అదియు మేమెరుగము; వీడు వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి; తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తలిదండ్రులు యూదులకు భయపడి ఆలాగు చెప్పిరి; ఎందుకనిన ఆయన క్రీస్తు అని యెవరైనను ఒప్పుకొనినయెడల వానిని సమాజమందిరములోనుండి వెలి వేతుమని యూదులు అంతకుమునుపు నిర్ణయించుకొని యుండిరి. కావున వాని తలిదండ్రులు–వాడు వయస్సు వచ్చినవాడు; వానిని అడుగుడనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడైయుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి –దేవుని మహిమపరచుము; ఈ మనుష్యుడు పాపియని మేమెరుగుదుమని వానితో చెప్పగా వాడు–ఆయన పాపియో కాడో నేనెరుగను; ఒకటి మాత్రము నేనెరుగుదును; నేను గ్రుడ్డివాడనైయుండి ఇప్పుడు చూచుచున్నాననెను. అందుకు వారు–ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఏలాగు తెరచెనని మరల వానిని అడుగగా వాడు–ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను.