యోహాను 5:1-18

యోహాను 5:1-18 TELUBSI

అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను. యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి–స్వస్థపడ గోరుచున్నావా అని వానినడుగగా ఆ రోగి–అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు–నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు–ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి. అందుకు వాడు– నన్ను స్వస్థపరచినవాడు–నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. వారు–నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచి– ఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు–నాతండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతిదినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.