యోహాను 4:43-54

యోహాను 4:43-54 TELUBSI

ఆ రెండుదినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్య మిచ్చెను. గలిలయులు కూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయనచేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్న హూములో ఒక ప్రధానికుమారుడు రోగియైయుండెను. యేసు యూదయనుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయనవచ్చి అతని స్వస్థ పరచవలెనని వేడుకొనెను. యేసు–సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకా ప్రధాని–ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు–నీవు వెళ్లుము, నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్లిపోయెను. అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి, అతని కుమారుడు బ్రదికి యున్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగు పడసాగెనని వారిని అడిగినప్పుడు వారు–నిన్న ఒంటి గంటకు జ్వరము వానిని విడిచెనని అతనితో చెప్పిరి. –నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ.