యోహాను 4:13-26

యోహాను 4:13-26 TELUBSI

అందుకు యేసు –ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి–అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదు కొనుట కింతదూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా యేసు నీవు వెళ్లి నీ పెనిమి టిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్ర్తీ–నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో– నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాటసరియే; నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. అప్పుడా స్ర్తీ–అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను –అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. ఆ స్త్రీ ఆయనతో–క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసు–నీతో మాటలాడుచున్ననేనే ఆయననని ఆమెతో చెప్పెను.