యూదుల అధికారియైన నీకొదేమను పరిసయ్యు డొకడుండెను. అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి–బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మే మెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే గాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో –ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను. అందుకు నీకొదేము – ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ యునై యున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. అందుకు నీకొదేము–ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను–నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై యుండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచినదానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీరంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో, ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంప లేదు. ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకుమునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డైవెనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిం చును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చును.
Read యోహాను 3
వినండి యోహాను 3
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 3:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు