యోహాను 21:15-23

యోహాను 21:15-23 TELUBSI

వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు – నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి–నన్ను వెంబడించుమని అతనితో అనెను. పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని–ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి–ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.

Free Reading Plans and Devotionals related to యోహాను 21:15-23