ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను. గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి –ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి, నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి. అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు– అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను. యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియ వచ్చి–నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.
Read యోహాను 20
వినండి యోహాను 20
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 20:1-20
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు