యోహాను 2:1-11

యోహాను 2:1-11 TELUBSI

మూడవదినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువ బడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి–వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో–అమ్మా, నాతో నీకేమి (పని)? నా సమయ మింకను రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి –ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. యేసు–ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. అప్పుడాయన వారితో–మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా, వారు తీసికొనిపోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియక పోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి –ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో, యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.