అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి–నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు–నేను కాను, నేనెరుగననెను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును–నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను. వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు. కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి–ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి. పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను. అందుకు పిలాతు–నేను యూదు డనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి–అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు; అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను. అయితే వారు–వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.
చదువండి యోహాను 18
వినండి యోహాను 18
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 18:24-40
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు