యోహాను 18:1-8

యోహాను 18:1-8 TELUBSI

యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను. ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి. మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.