యోహాను 13:6-16

యోహాను 13:6-16 TELUBSI

ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి నప్పుడు అతడు–ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదుగాని యికమీదట తెలిసికొందువని అతనితో చెప్పగా పేతురు–నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు–నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు–ప్రభువా, నా పాదములు మాత్రమేగాక నా చేతులు నా తల కూడ కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి–స్నానముచేసినవాడు పాదములు తప్ప మరేమియు కడుగు కొన నక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యెను. మీరును పవిత్రులు కాని మీలో అందరు పవిత్రులు కారనెను. తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక– మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసికొనిన తరువాత, ఆయన మరల కూర్చుండి–నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువు ను బోధకుడనైన నేను మీ పాదములు కడిగినయెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.