యోహాను 13:21-38

యోహాను 13:21-38 TELUBSI

యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవర పడి–మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను ఆయన యెవరినిగూర్చి యీలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరితట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన యొకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరినిగూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు–ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు–నేనొక ముక్క ముంచి యెవని కిచ్చెదనో వాడే అని చెప్పి, ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను; వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు–నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందునిమిత్తము అతనితో ఆలాగు చెప్పెనో అది భోజనమునకు కూర్చుండినవారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదాయొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసినవాటినికొనుమని యైనను, బీదలకేమైన ఇమ్మని యైనను యేసు వానితో చెప్పినట్టు కొందరనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్లెను; అప్పుడు రాత్రివేళ. వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను–ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు; దేవుడును ఆయనయందు మహిమపరచబడి యున్నాడు. దేవుడు ఆయనయందు మహిమపరచబడినయెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును; వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, యింక కొంతకాలము మీతోకూడ ఉందును, మీరు నన్ను వెదకుదురు, నేనెక్క డికి వెళ్లుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పినప్రకారము ఇప్పుడు మీతోను చెప్పు చున్నాను. మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించి నట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురనెను. సీమోను పేతురు–ప్రభువా, నీవెక్కడికి వెళ్లుచున్నావని ఆయనను అడుగగా యేసు–నేను వెళ్లు చున్నచోటికి నీవిప్పుడు నావెంట రాలేవుగాని, తరువాత వచ్చెదవని అతనితో చెప్పెను. అందుకు పేతురు –ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు–నాకొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడికూయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.