యోహాను 12:12-36

యోహాను 12:12-36 TELUBSI

మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు– మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి. ఆ పండుగలో ఆరాధింపవచ్చినవారిలో కొందరు గ్రీసుదేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి–అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి అంద్రెయతో చెప్పెను, అంద్రెయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను–మనుష్యకుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియున్నది. గోధుమగింజ భూమిలో పడి చావకుండినయెడల అది ఒంటిగానే యుండును; అది చచ్చినయెడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించు వాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవముకొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినయెడల నన్ను వెంబడింపవలెను; అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును; ఒకడు నన్ను సేవించినయెడల నా తండ్రి అతని ఘనపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది; నేనేమందును?–తండ్రీ, యీ గడియ తటస్థింపకుండ నన్ను తప్పించుము; అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని; తండ్రీ, నీ నామము మహిమపరచుమని చెప్పెను. అంతట–నేను దానిని మహిమపరచితిని, మరల మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము–ఉరిమెను అనిరి. మరికొందరు–దేవదూత ఒకడు ఆయనతో మాటలాడెననిరి. అందుకు యేసు– ఈ శబ్దము నాకొరకు రాలేదు, మీకొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును; నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. జనసమూహము–క్రీస్తు ఎల్లప్పుడు ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి. మనుష్యకుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన నడిగిరి. అందుకు యేసు–ఇంక కొంతకాలము వెలుగు మీమధ్య ఉండును; చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండ గనే నడువుడి; చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో యెరుగడు. మీరు వెలుగు సంబంధు లగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను.