కాబట్టి యేసు తాను మృతులలోనుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కాపండుగకు ఆరు దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను; లాజరు ఆయనతోకూడ భోజనమునకు కూర్చున్నవారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర యెత్తు తీసికొని, యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచెను; ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైయున్న ఇస్కరియోతు యూదా –యీ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడీలాగు చెప్పినది బీదలమీద శ్రద్ధకలిగి కాదుగాని వాడు దొంగయైయుండి, తన దగ్గర డబ్బు సంచియుండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక ఆలాగు చెప్పెను. కాబట్టి యేసు–నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననియ్యుడి; బీదలు ఎల్లప్పుడును మీతోకూడ ఉందురుగాని నేనెల్లప్పుడు మీతో ఉండనని చెప్పెను. కాబట్టి యూదులలో సామాన్యజనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలిసికొని, యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలోనుండి ఆయన లేపిన లాజరును కూడ చూడవచ్చిరి. అతనినిబట్టి యూదులలో అనేకులు తమవారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధానయాజకులు లాజరును కూడ చంప నాలోచనచేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజనసమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి. –సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమ పరచబడినప్పుడు అవి ఆయననుగూర్చి వ్రాయబడెననియు, వారాయనకు వాటినిచేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. ఆయన లాజరును సమాధిలోనుండి పిలిచి మృతులలోనుండి అతని లేపినప్పుడు, ఆయనతోకూడ ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసెనని జనులు విని ఆయనను ఎదుర్కొన బోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు– మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయనవెంటపోయినదని చెప్పుకొనిరి.
చదువండి యోహాను 12
వినండి యోహాను 12
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 12:1-19
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు