యోహాను 11:17-44

యోహాను 11:17-44 TELUBSI

యేసు వచ్చి అదివరకే అతడు నాలుగు దినములు సమాధిలో ఉండెనని తెలిసికొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై యుండెను; దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరునిగూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చియుండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్లెనుగాని మరియ యింటిలో కూర్చుండి యుండెను. మార్త యేసుతో–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకను గ్రహించునని యెరుగుదుననెను. యేసు–నీ సహోదరుడు మరల లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో–అంత్య దినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదుననెను. అందుకు యేసు–పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రదుకును; బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. ఆమె–అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడ వైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్లి–బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరియైన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకను ఆ గ్రామములోనికి రాక, మార్త ఆయనను కలిసికొనిన చోటనే ఉండెను గనుక యింటిలో మరియతోకూడ నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్లుట చూచి, ఆమె సమాధియొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్లుచున్నదనుకొని ఆమె వెంట వెళ్లిరి. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి, ఆయనను చూచి, ఆయన పాదములమీద పడి–ప్రభువా, నీవిక్కడ ఉండినయెడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు, ఆమెతోకూడ వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు–అతని నెక్కడ నుంచితిరని అడుగగా, వారు–ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు–అతనిని ఏలాగు ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు–ఆ గ్రుడ్డివాని కన్నులు తెరచిన యీయన, యితనిని చావకుండ చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచు సమాధియొద్దకు వచ్చెను. అది యొక గుహ, దానిమీద ఒక రాయి పెట్టియుండెను. యేసు–రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయినవాని సహోదరియైన మార్త–ప్రభువా, అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికి వాసనకొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు–నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను; అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి–తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృత జ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టు నిలిచియున్న యీ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై యీ మాట చెప్పితిననెను. ఆయన ఆలాగు చెప్పి–లాజరూ, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు– మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.

Free Reading Plans and Devotionals related to యోహాను 11:17-44