ఆలయ ప్రతిష్ఠితపండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా యూదులు ఆయనచుట్టు పోగై–ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు–మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొఱ్ఱెలలోచేరినవారుకారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలోనుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు; నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేతపట్టుకొనగా యేసు– తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు–నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. అందుకు యేసు–మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల–నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో – నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నాతండ్రి క్రియలు చేయనియెడల నన్ను నమ్మకుడి, చేసినయెడల నన్ను నమ్మకున్నను, తండ్రి నాయందును నేను తండ్రియందును ఉన్నామని మీరు గ్రహించి తెలిసికొనునట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. వారు మరల ఆయనను పట్టుకొన చూచిరిగాని ఆయన వారి చేతినుండి తప్పించుకొని పోయెను. యొర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిస్మమిచ్చు చుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్లి అక్కడనుండెను. అనేకులు ఆయనయొద్దకు వచ్చి–యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని యీయననుగూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైన వనిరి. అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి.
చదువండి యోహాను 10
వినండి యోహాను 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యోహాను 10:22-42
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు