యోహాను 10:11-18

యోహాను 10:11-18 TELUBSI

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొఱ్ఱెల కాపరికాడు గనుక గొఱ్ఱెలు తనవికానందున తోడేలు వచ్చుట చూచి గొఱ్ఱెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొఱ్ఱెలను పెట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొఱ్ఱెలనుగూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొఱ్ఱెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. ఈ దొడ్డివికాని వేరే గొఱ్ఱెలును నాకు కలవు; వాటిని కూడ నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొఱ్ఱెల కాపరి ఒక్కడును అగును. నేను దాని మరల తీసికొనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను; ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసికొనడు; నా అంతట నేనే దాని పెట్టుచున్నాను; దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు; నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను.