యోహాను 1:35-46

యోహాను 1:35-46 TELUBSI

మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతడు నడుచుచున్న యేసువైపు చూచి–ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను. అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి–మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు–రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి యను మాటకు బోధకుడని అర్థము. – వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను.