యోహాను 1
1
1ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. 4ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 5ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను.
6దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. 7అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్య మిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 8అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. 9నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతిమనుష్యుని వెలిగించుచున్నది. 10ఆయన లోకములో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు. 11ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. 14ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని#1:14 లేక, జనితైకకుమారుని. మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి 15యోహాను ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు–నా వెనుక వచ్చువాడు నాకంటె ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. 16ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను. 18ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే#1:18 లేక, జనితైకకుమారుడే. అనేక ప్రాచీనప్రతులలో– అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. ఆయనను బయలు పరచెను.
19నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపి నప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. 20అతడు ఎరుగననక ఒప్పుకొనెను; క్రీస్తును#1:20 క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము. కానని ఒప్పుకొనెను. 21కాగా వారు–మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు–కాననెను. 22–నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా– కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు–నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. 23అందు కతడు–ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను
ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్య
ములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము
అని చెప్పెను. 24పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు. 25వారు–నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్త వైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా 26-27యోహాను– నేను నీళ్లలో#1:26-27 లేక, నీళ్లతో. బాప్తిస్మ మిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు; మీరాయన నెరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. 28యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను.
29మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి–ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. 30నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. 31నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో#1:31 లేక, నీళ్లతో. బాప్తిస్మ మిచ్చుచు వచ్చితినని చెప్పెను. 32మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు–ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. 33నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో#1:33 లేక, నీళ్లతో. బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు–నీవెవనిమీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో#1:33 లేక, పరిశుద్ధాత్మతో. బాప్తిస్మ మిచ్చువాడని నాతో చెప్పెను. 34ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.
35మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా 36అతడు నడుచుచున్న యేసువైపు చూచి–ఇదిగో దేవుని గొఱ్ఱెపిల్ల అని చెప్పెను. 37అతడు చెప్పినమాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 38యేసు వెనుకకు తిరిగి, వారు తన్ను వెంబడించుట చూచి–మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు–రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బి యను మాటకు బోధకుడని అర్థము. 39– వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కాపురమున్న స్థలము చూచి, ఆ దినము ఆయన యొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయెను. 40యోహాను మాట విని ఆయనను వెంబడించిన యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. 41ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి–మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి 42యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడని#1:42 మూలభాషలోక్రీస్తు. అర్థము. యేసు అతనివైపు చూచి–నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
43మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని–నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 44ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అనువారి పట్టణపు కాపురస్థుడు. 45ఫిలిప్పు నతనయేలును కనుగొని – ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు#1:45 యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. అని అతనితో చెప్పెను. 46అందుకు నతనయేలు – నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగగా–వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. 47యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి–ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. 48–నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు–ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్న ప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 49నతనయేలు–బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. 50అందుకు యేసు –ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను. 51మరియు ఆయన – మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
యోహాను 1: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.