యిర్మీయా 42:1-12

యిర్మీయా 42:1-12 TELUBSI

అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి –మేము ఎంత కొంచెము మందిమి మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికి ఉత్తరమిచ్చినదేమనగా–మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి–నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాటలేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము. పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనలయధపతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా –నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్నయెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను. మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి, మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.