యిర్మీయా 29:4-14

యిర్మీయా 29:4-14 TELUBSI

–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా తన ప్రేరేపణచేత బబులోనునకు చెరతీసికొని పోబడినవారికందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు –ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసికొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువలేకుండ అభివృద్ధిపొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణముయొక్క క్షేమముకోరి దానికొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– మీ మధ్యనున్న ప్రవక్తలచేతనైనను మంత్రజ్ఞులచేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు కనువారి మాటలు వినకుడి. వారు నా నామమునుబట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు; ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకినయెడల, పూర్ణమనస్సుతో నన్నుగూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కను గొందురు, నన్ను నేను మీకు కనుపరచుకొందును; ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలోనుండి రప్పించెదను; నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరిలోనుండియు ఆ స్థలములన్నిటిలోనుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటనుండి మిమ్మును చెరకుపంపితినో అచ్చటికే మిమ్మును మరల రప్పింతును.