అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులమీద ఏలికయైయుండెను. అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానులమీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారిమీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమా నులు అబీమెలెకును వంచించిరి. ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారినందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను. ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి. వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతలమందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను–అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదముగాని మనము అతని కెందుకు దాసులము కావలెను? ఈ జనము నా చేతిలో ఉండినయెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను. ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను. అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి–ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చియున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపుచున్నారు. కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి, ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను. అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచియుండిరి. ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి. గాలు ఆ జనులను చూచి జెబులుతో–ఇదిగో జనులు కొండశిఖరములమీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులు–కొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను. గాలు–చూడుము, దేశపు ఎత్తయిన స్థలమునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను. జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి. అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను. మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి. అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగాచేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీదపడి వారిని హతముచేసెను. అబీమెలెకును అతనితోనున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను. షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి. షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్లనుండి పెద్దకొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొని–నేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను. అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి. తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజమానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీదపడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీదిరాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. అప్పుడతడు తన ఆయుధములను మోయుబంటును త్వరగా పిలిచి–ఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను. అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి. అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరులను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను. షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజేసెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.
చదువండి న్యాయాధిపతులు 9
వినండి న్యాయాధిపతులు 9
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: న్యాయాధిపతులు 9:22-57
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు