న్యాయాధిపతులు 4

4
1ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక 2యెహోవా హాసోరులో ఏలు కనానురాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా. 3అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.
4ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. 5ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి. 6ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవువెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము; 7నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా 8బారాకు –నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదనుగాని నీవు నాతోకూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను. 9అప్పుడు ఆమె–నీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవుచేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతోకూడ కెదెషునకు వెళ్లెను. 10బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి; 11దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను. 12అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను 13అన్యుల హరోషెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా 14దెబోరా–లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీదినుండి దిగి వచ్చెను. 15బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. 16బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు 17హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను. 18అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి –నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. 19ఆమె గొంగళితో అతని కప్పగా అతడు–దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా 20అతడు–గుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చి–యిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవు –ఎవడును లేడని చెప్పవలెననెను. 21పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా 22అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి–రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.
23ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనానురాజైన యాబీనును అణచెను. 24తరువాత వారు కనానురాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనానురాజైన యాబీనుకు విరోధముగా అంత కంతకు హెచ్చుచువచ్చెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

న్యాయాధిపతులు 4: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి