యాకోబు 3:2-10

యాకోబు 3:2-10 TELUBSI

అనేకవిషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాటయందు తప్పనియెడల అట్టివాడు లోపము లేనివాడై, తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొన శక్తిగలవాడగును. గుఱ్ఱములు మనకు లోబడుటకై నోటికి కళ్లెముపెట్టి, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా ఓడలను కూడ చూడుడి; అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపువాని ఉద్దేశముచొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కానిచేత త్రిప్పబడును. ఆలాగుననే నాలుక కూడ చిన్న అవయవమైనను బహుగా అదిరి పడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును! నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిజాతియు నరజాతి చేత సాధుకాజాలును, సాధు ఆయెను గాని యే నరుడును నాలుకను సాధుచేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రియైన ప్రభువు ను స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికెగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్కనోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు.