ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచువారి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.
చదువండి యెషయా 42
వినండి యెషయా 42
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: యెషయా 42:1-9
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు