హెబ్రీయులకు 8:6-13

హెబ్రీయులకు 8:6-13 TELUBSI

ఈయనయైతే ఇప్పుడు మరియెక్కువైన వాగ్దానములనుబట్టి నియమింపబడిన మరి యెక్కువైన నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు గనుక మరి శ్రేప్ఠమైన సేవకత్వము పొంది యున్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు – ప్రభువు ఇట్లనెను–ఇదిగో యొక కాలమువచ్చుచున్నది. అప్పటిలో ఇశ్రాయేలు ఇంటివారితోను యూదా ఇంటివారితోను నేను క్రొత్తనిబంధన చేయుదును. అది నేను ఐగుప్తుదేశములోనుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమునవారితో నేను చేసిన నిబంధనవంటిది కాదు. ఏమనగా–వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసితినని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటివారితో నేను చేయబోవు నిబంధన యేదనగా,వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను వారి హృదయములమీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడునై యుందునువారు నాకు ప్రజలైయుందురు.వారిలో ఎవడును – ప్రభువు ను తెలిసికొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశముచేయడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దలవరకు అందరును నన్ను తెలిసికొందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగివారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసి కొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది.