హెబ్రీయులకు 10:1-22

హెబ్రీయులకు 10:1-22 TELUBSI

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగల . దియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆయాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. ఆలాగు చేయగలిగినయెడల సేవించువారొక్కసారే శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాపజ్ఞిప్త ఇకను ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా. అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. –బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. అప్పుడు నేను–గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని. –బలులు అర్పణలు పూర్ణహోమములు పాపపరి హారార్థబలులును నీవు కోరలేదనియు, అవి నీకిష్టమైనవి కావనియు పైని చెప్పిన తరువాత ఆయన–నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానని చెప్పు చున్నాడు. ఇవన్నియు ధర్మశాస్త్రముచొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవదానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమునుబట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవచేయుచు, పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును. ఈయనయైతే పాపములనిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీను డాయెను. ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడ మనకు సాక్ష్యమిచ్చుచున్నాడు. ఏలాగనగా –ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే–నా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత –వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములుగలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములుగలవారమునైయుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము.