ఆదికాండము 45:15-28

ఆదికాండము 45:15-28 TELUBSI

అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి. యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను. అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను–నీవు నీ సహోదరులను చూచి–మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి. ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాటచొప్పున వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను. అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను, అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను. అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా–మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను. వారు ఐగుప్తునుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి నప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్ప రిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు–ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

ఆదికాండము 45:15-28 కోసం వీడియో