ఆదికాండము 37:18-36

ఆదికాండము 37:18-36 TELUBSI

అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచనచేసిరి. వారు–ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు; వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రూబేను ఆ మాట విని– మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండ అతని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతని నప్పగించుటకై వారి చేతులలో పడకుండ అతని విడిపింప దలచి–రక్తము చిందింపకుడి; అతనికి హాని ఏమియు చేయక అడవిలోనున్న యీ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని యుండిన ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి, అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు. వారు భోజనముచేయ కూర్చుండి, కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసికొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్థులు గిలాదునుండి వచ్చుచుండిరి. అప్పుడు యూదా మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదము రండి;వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయు లైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి. రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేక పోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి–చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్క డికి పోదుననగా వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువు టంగీని పంపగా వారు తండ్రియొద్దకు దానిని తెచ్చి–ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గురుతుపట్టుమని చెప్పిరి అతడు దానిని గురుతుపెట్టి –ఈ అంగీ నా కుమారునిదే; దుష్ట మృగము వానిని తినివేసెను; యోసేపు నిశ్చయముగా చీల్చబడెననెను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరును అతని కుమార్తెలందరును అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి; అయితే అతడు ఓదార్పు పొంద నొల్లక–నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్లెదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. మిద్యానీయులు ఐగుప్తునకు అతని తీసికొనిపోయి, ఫరోయొక్క ఉద్యోగస్థుడును రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరునకు అతనిని అమ్మి వేసిరి.

ఆదికాండము 37:18-36 కోసం వీడియో

Free Reading Plans and Devotionals related to ఆదికాండము 37:18-36