అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా రెండువందల మేకలను ఇరువది మేకపోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా తన దాసులచేతి కప్పగించి–మీరు మందమందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో–నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని–నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల నీవు–ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావుకొరకు పంపబడిన కానుక; అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు–నేను ముందుగా పంపుచున్న కానుకవలన అతని సమాధానపరచిన తరువాత నేను అతని ముఖము చూచెదను; అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని–మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలెననియు మీరు–ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలెననియు రెండవవానికిని మూడవవానికిని మందల వెంబడి వెళ్లిన వారికందరికిని ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన యిద్దరు భార్యలను తన యిద్దరు దాసీలను తన పదకొండుమంది పిల్లలను తీసికొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. యాకోబు ఒక్కడు మిగిలి పోయెను; ఒక నరుడు తెల్లవారువరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన–తెల్లవారు చున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు–నీవు నన్ను ఆశీర్వదించితేనేగాని నిన్ను పోనియ్యననెను. ఆయన–నీ పేరేమని యడుగగా అతడు–యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన–నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలేగాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు–నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందు కాయన–నీవు ఎందునిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతని నాశీర్వదించెను. యాకోబు–నేను ముఖాముఖిగా దేవుని చూచితిని అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలునుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను; అప్పుడతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటిమీది తుంటినరము కొట్టినందున నేటివరకు ఇశ్రాయేలీయులు తొడ గూటిమీదనున్న తుంటినరము తినరు.
చదువండి ఆదికాండము 32
వినండి ఆదికాండము 32
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 32:13-32
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు