లాబాను కుమారులు–మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసికొని, మన తండ్రికి కలిగిన దానివలన ఈ యావదాస్తి సంపాదించెనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతనియెడల ఉండలేదు. అప్పుడు యెహోవా–నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము; నేను నీకు తోడైయుండెదనని యాకోబుతో చెప్పగా యాకోబు పొలములో తన మందయొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో యిట్లనెను. –మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నామీద ఉండినట్లు ఇప్పుడు నామీద నుండలేదని నాకు కనబడుచున్నది; అయితే నా తండ్రియొక్క దేవుడు నాకు తోడై యున్నాడు; మీ తండ్రికి నా యావచ్ఛక్తితో కొలువు చేసితినని మీకు తెలిసే యున్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి పది మార్లు నా జీతము మార్చెను; అయినను–దేవుడు అతని నాకు హానిచేయ నియ్యలేదు. అతడు–పొడలు గలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు పొడలుగల పిల్లలనీనెను. చారలుగలవి నీ జీతమగునని చెప్పినయెడల అప్పుడు మందలన్నియు చారలుగల పిల్లల నీనెను. అట్లు దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చెను. మందలు చూలుకట్టు కాలమున నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొఱ్ఱెలను దాటు పొట్టేళ్లు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవై యుండెను. మరియు ఆ స్వప్నమందు దేవుని దూత –యాకోబూ అని నన్ను పిలువగా–చిత్తము ప్రభువా అని చెప్పితిని. అప్పుడు ఆయన–నీ కన్నులెత్తి చూడుము; గొఱ్ఱెలను దాటు చున్న పొట్టేళ్లన్నియు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి; ఏలయనగా లాబాను నీకు చేయుచున్నది యావత్తును చూచితిని నీ వెక్కడ స్తంభముమీద నూనె పోసితివో, యెక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి యీ దేశములోనుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్లుమని నాతో చెప్పెననెను. అందుకు రాహేలును లేయాయు– యింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మును అమ్మివేసి, మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేసెను. దేవుడు మా తండ్రి యొద్దనుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునైయున్నది గదా? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్ల చేయుమని అతనికి ఉత్తరమియ్యగా యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెలమీద నెక్కించి కనానుదేశమునకు తన తండ్రియైన ఇస్సాకు నొద్దకు వెళ్లుటకు తన పశువులన్నిటిని, తాను సంపాదించిన సంపద యావత్తును, పద్దన రాములో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసికొని పోయెను. లాబాను తన గొఱ్ఱెలబొచ్చు కత్తిరించుటకు వెళ్లియుండగా రాహేలు తన తండ్రి యింటనున్న గృహ దేవతలను దొంగిలెను. యాకోబు తాను పారిపోవు చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయక పోవుటవలన అతని మోసపుచ్చినవాడాయెను. అతడు తనకు కలిగినదంతయు తీసికొని పారిపోయెను. అతడు లేచి నది దాటి గిలాదను కొండతట్టు అభిముఖుడై వెళ్లెను.
Read ఆదికాండము 31
వినండి ఆదికాండము 31
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 31:1-21
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు