రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనక పోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో–నాకు గర్భఫలము నిమ్ము; లేనియెడల నేను చచ్చెదననెను. యాకోబు కోపము రాహేలుమీద రగులుకొనగా అతడు–నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందు కామె–నా దాసియైన బిల్హా ఉన్నది గదా; ఆమెతో పొమ్ము; ఆమె నా కొరకు పిల్లలను కనును; ఆలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసియైన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతియై యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు–దేవుడు నాకు తీర్పు తీర్చెను; ఆయన నా మొరను విని నాకు కుమారుని దయ చేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసియైన బిల్హా తిరిగి గర్భవతియై యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు–దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసియైన జిల్పాను తీసికొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా–ఇది అదృష్టమేగదా అనుకొని అతనికి గాదు అను పేరుపెట్టెను. లేయా దాసియైన జిల్పా యాకోబునకు రెండవ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను–స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాతవృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలు–నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా ఆమె –నా భర్తను తీసికొంటివే అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసికొందువా అని చెప్పెను. అందుకు రాహేలు–కాబట్టి నీ కుమారుని పుత్రదాతవృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలమునుండి వచ్చునప్పుడు లేయా అతనిని ఎదుర్కొన బోయి–నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాతవృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను. లేయా–నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను. లేయా మరల గర్భవతియై యాకోబునకు ఆరవ కుమారుని కనెను. అప్పుడు లేయా–దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను; నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయుననుకొని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కొమార్తెను కని ఆమెకు దీనా అను పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడామె గర్భవతియై కుమారుని కని–దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె–యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
చదువండి ఆదికాండము 30
వినండి ఆదికాండము 30
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 30:1-24
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు