ఆదికాండము 27:30-46

ఆదికాండము 27:30-46 TELUBSI

ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చి–నా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను. అతని తండ్రియైన ఇస్సాకు–నీ వెవర వని అతని నడిగినప్పుడు అతడు–నేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు–అట్లయితే వేటాడిన భోజ్యమును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలోతిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి–ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను. అతడు–నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను. ఏశావు–యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోసపుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పి–నాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను. అందుకు ఇస్సాకు–ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తర మియ్యగా ఏశావు–నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు– నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడుచుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరమిచ్చెను. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావు–నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను–ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్నుగూర్చి తన్నుతాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము; అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను. మరియు రిబ్కా ఇస్సాకుతో–హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసికొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజన మనెను.

ఆదికాండము 27:30-46 కోసం వీడియో