అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను. అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానము లిచ్చి, తాను సజీవుడై యుండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్దనుండి తూర్పుతట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసెను. అబ్రాహాము బ్రదికిన సంవత్సరములు నూట డెబ్బదియైదు. అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతిబొంది తన పితరులయొద్దకు చేర్చబడెను. హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది. అబ్రాహాము హేతు కుమారులయొద్ద కొనిన పొలములోనే అబ్రాహామును అతని భార్యయైన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బెయేర్ లహాయిరోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తీయురాలును శారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి యిదే. ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము మిష్మా దూమా మశ్శా హదరు తేమా యెతూరు నాపీషు కెదెమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరులచొప్పున ఇష్మాయేలు కుమారులయొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే, వారి పేరులు ఇవే, వారివారి జనముల ప్రకారము వారు పండ్రెండుగురు రాజులు. ఇష్మాయేలు బ్రదికిన సంవత్సరములు నూట ముప్పదియేడు. అప్పుడతడు ప్రాణమువిడిచి మృతిబొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్లు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరువరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి యెదుట నివాస మేర్పరచుకొనెను. అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు.
Read ఆదికాండము 25
వినండి ఆదికాండము 25
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 25:5-26
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు