ఆదికాండము 25:19-34

ఆదికాండము 25:19-34 TELUBSI

అబ్రాహాము కుమారుడగు ఇస్సాకు వంశావళియిదే. అబ్రాహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరియునైన రిబ్కాను పెండ్లిచేసికొన్నప్పుడు నలుబది సంవత్సరములవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్యయైన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె–ఈలాగైతే నేను బ్రదుకుట యెందు కని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతో నిట్లనెను– రెండు జనములు నీ గర్భములో కలవు. రెండు జనపదములు నీ కడుపులోనుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిప్ఠమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎఱ్ఱనివాడుగా బయటికివచ్చెను. అతని ఒళ్లంతయు రోమ వస్త్రమువలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చి నప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని యుండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది యేండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరియై అరణ్యవాసిగా నుండెను; యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేటమాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను; రిబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూరవంటకము వండు కొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములోనుండి వచ్చి –నేను అలసియున్నాను; ఆ యెఱ్ఱయెఱ్ఱగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను; అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు–నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు–నేను చావబోవుచున్నాను గదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు–నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణముచేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావు కిచ్చెను; అతడుతిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను.

ఆదికాండము 25:19-34 కోసం వీడియో