ఆదికాండము 24:52-67

ఆదికాండము 24:52-67 TELUBSI

అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను. అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమునవారు లేచి నప్పుడు అతడు–నా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు–ఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చుననిరి. అప్పుడతడు–యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు వారు–ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని రిబ్కాను పిలిచి–ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు –వెళ్లెదననెను. కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను, రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి –మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడు–ఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను. అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.

ఆదికాండము 24:52-67 కోసం వీడియో