అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము; నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదననెను. ఆ దాసుడు – ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా అబ్రాహాము–అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ. నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశమునుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడి–నీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణముచేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవుగాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను. అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్ఠమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోకరింపచేసి యిట్లనెను –నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాముమీద అనుగ్రహము చూపుము. చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచుచున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి–నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా –నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజముమీద పెట్టుకొనివచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని యెక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి –నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను. అందుకామె–అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత–నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించితిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తుకొనిపోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను. ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవలెనని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి –నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను. అందుకామె –నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను. మరియు ఆమె–మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి – అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల యింటికి నన్ను నడిపించెననెను. అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను. రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలుపటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను. అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి–ఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెల దగ్గర నిలిచి యుండగా లాబాను–యెహోవావలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను. ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితోకూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెనుగాని అతడు–నేను వచ్చిన పనిచెప్పకమునుపు భోజనము చేయననగా లాబాను –చెప్పుమనెను. అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు; మరియు నా యజమానుడు నాతో–నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు. అయితే నా తండ్రి యింటి కిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో –ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు అతడు –ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతోకూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడల కూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను. నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి–అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణమును నీవు సఫలము చేసినయెడల నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను–నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు –నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని. నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపకముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడు–నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి –త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను. అప్పుడు నేను–నీవు ఎవరికుమార్తెవని యడిగినందుకు ఆమె –మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానునియొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెద ననగా లాబానును బెతూయేలును–ఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవుననిగాని కాదనిగాని చెప్ప జాలము; ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తర మిచ్చిరి.
Read ఆదికాండము 24
వినండి ఆదికాండము 24
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ఆదికాండము 24:1-51
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు