గలతీయులకు 2:6-21

గలతీయులకు 2:6-21 TELUBSI

ఎన్నికైనవారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త పేతురుకేలాగు అప్పగింపబడెనో ఆలాగు సున్నతి పొందనివారికి బోధించుటకై నా కప్ప గింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందినవారికి అపొస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపొస్తలుడనవుటకు నాకును సామర్థ్యము కలుగజేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతిపొందినవారికిని అపొ స్తలులుగా ఉండవలెనని చెప్పి, తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడిచేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకము చేసికొనవలెనని మాత్రమే వారు కోరిరి; ఆలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి యుంటిని. అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యాకోబు నొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనముచేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడ వారి వేషధారణముచేత మోస పోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా–నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మమువలన యూదులమే గాని అన్యజనులలోచేరిన పాపులము కాము. మనుష్యుడు యేసు క్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున నీతిమంతుడుగా తీర్చబడడని యెరిగి మనమును ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసముంచియున్నాము; ధర్మశాస్త్రసంబంధ క్రియలమూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదకుచుండగా మనము పాపులముగా కనబడినయెడల, ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయెనా? అట్లనరాదు. నేను పడగొట్టినవాటిని మరల కట్టినయెడల నన్ను నేనే అపరాధినిగా కనుపరచుకొందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రమువలన ధర్మశాస్త్రము విష యమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.

గలతీయులకు 2:6-21 కోసం వీడియో