గలతీయులకు 1:3-24

గలతీయులకు 1:3-24 TELUBSI

తండ్రియైన దేవునినుండియు మన ప్రభువైన యేసుక్రీస్తునుండియు మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన తండ్రియైన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు కృపనుబట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్తతట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిదివరకు చెప్పినప్రకారమిప్పుడును మరల చెప్పుచున్నాము; మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి యెవడైనను మీకు ప్రకటించినయెడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరు చున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచనప్రకారమైనది కాదని మీకు తెలియ జెప్పు చున్నాను. మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనై యున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనముచేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గల వాడనై, నా స్వజాతీయులలో నా సమానవయస్కులైన అనేకులకంటె యూదుల మతములో ఆధిక్యతనొందితినని నా నడవడినిగూర్చి మీరు వింటిరి. అయినను తల్లిగర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రతింపలేదు. నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని మూడు సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసికొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితోకూడ పదునయిదు దినములుంటిని. అతనిని తప్ప అపొస్తలులలో మరి ఎవనిని నేను చూడలేదు గాని, ప్రభువుయొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న యీ సంగతుల విషయమై, యిదిగో దేవుని యెదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియ, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయసంఘములవారికి నా ముఖపరిచయములేకుండెను గాని –మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతిమాత్రమే విని, వారు నన్నుబట్టి దేవుని మహిమపరచిరి.