నిర్గమకాండము 30:1-10

నిర్గమకాండము 30:1-10 TELUBSI

మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను. దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను. దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.

నిర్గమకాండము 30:1-10 కోసం వీడియో