నిర్గమకాండము 20:1-23

నిర్గమకాండము 20:1-23 TELUBSI

దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను. –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి –నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడినయెడల మేము చనిపోవుదుము అందుకు మోషే–భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను – ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు.

నిర్గమకాండము 20:1-23 కోసం వీడియో