నిర్గమకాండము 15:19-27

నిర్గమకాండము 15:19-27 TELUBSI

ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవావారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను– యెహోవాను గానము చేయుడి ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి, –మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.

నిర్గమకాండము 15:19-27 కోసం వీడియో