నిర్గమకాండము 15:1-18

నిర్గమకాండము 15:1-18 TELUBSI

అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి– యెహోవానుగూర్చి గానముచేసెదను ఆయన మిగుల అతిశయించి జయించెను గుఱ్ఱమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయెను. ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమ నుతించెదను. యెహోవా యుద్ధశూరుడు యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి. యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరివలన నీళ్లు రాశిగా కూర్చబడెను ప్రవాహములు కుప్పగా నిలిచెను అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను –తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెనువారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి. యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను. నీవు విమోచించిన యీ ప్రజలను నీ కృపచేత తోడుకొనిపోతివి నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి. జనములు విని దిగులుపడును ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు. భయము అధికభయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందువారిని నిలువ పెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు.

నిర్గమకాండము 15:1-18 కోసం వీడియో