ఎఫెసీయులకు 3:8-21

ఎఫెసీయులకు 3:8-21 TELUBSI

దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగై యున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయననుబట్టి మనకు కలిగియున్నవి. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చినశ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములై యున్నవి. ఈ హేతువుచేత పరలోకమునందును, భూమిమీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రినిబట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రియెదుట నేను మోకాళ్లూని మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసముద్వారా నివసించునట్లుగాను, తన మహిమైశ్వ ర్యముచొప్పున మీకు దయచేయవలెననియు, మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా, ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతోకూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి, క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్.