ప్రసంగి 2:10-22

ప్రసంగి 2:10-22 TELUBSI

నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను. రాజు తరువాత రాబోవువాడు, ఇదివరకు జరిగిన దాని విషయము సయితము ఏమి చేయునో అనుకొని, నేను జ్ఞానమును వెఱ్ఱితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకొంటిని. అంతట చీకటికంటె వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనతకంటె జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలిసికొంటిని. జ్ఞానికి కన్నులు తలలో నున్నవి, బుద్ధిహీనుడు చీకటియందు నడుచుచున్నాడు; అయినను అందరికిని ఒక్కటే గతి సంభవించునని నేను గ్రహించితిని. కావున–బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఏల సంపాదించితినని నా హృదయమందనుకొంటిని. ఇదియు వ్యర్థమే. బుద్ధిహీనులనుగూర్చినట్లుగానే జ్ఞానులనుగూర్చియు జ్ఞాపకము ఎన్నటికిని యుంచబడదు; రాబోవు దినములలో వారందరును మరువబడినవారై యుందురు; జ్ఞానులు మృతినొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను–అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రదుకుట నా కసహ్యమాయెను. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసి కొని నేను వాటియందు అసహ్యపడితిని. వాడు జ్ఞానము గలవాడైయుండునో బుద్ధిహీనుడైయుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే. కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాస మంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని. ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును; అయితే దానికొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయ వలసి వచ్చును; ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై యున్నది. సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాస మంతటిచేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటిచేతను, వానికేమి దొరుకుచున్నది?