–దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి యందేగాని భూమి క్రిందనున్న నీళ్లయందేగాని యుండు దేని పోలికనైన విగ్రహమును చేసికొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు; వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారి విషయములో వేయితరములవరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుము. ఆరుదినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ యెద్దయినను నీ గాడిద యైనను నీ పశువులలో ఏదైనను నీ యిండ్లలోనున్న పర దేశియైనను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీవలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తుదేశమందు దాసుడవైయున్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలముచేతను చాచిన చేతిచేతను నిన్ను అక్కడనుండి రప్పించెనని జ్ఞాపకము చేసికొనుము. అందు చేతను విశ్రాంతిదినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీ కనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు. వ్యభిచరింపకూడదు. దొంగిలకూడదు. నీ పొరుగువానిమీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు; నీ పొరుగువాని యింటినైనను వాని పొలమునైనను వాని దాసినైనను వాని దాసినినైనను వాని యెద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ఈ మాటలను యెహోవా ఆ పర్వతముమీద అగ్ని మేఘ గాఢాంధకారములమధ్యనుండి గొప్ప స్వరముతో మీ సమాజమంతటితో చెప్పి, రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసి నాకిచ్చెను. ఆయన మరేమియు చెప్పలేదు.
Read ద్వితీయోపదేశకాండము 5
వినండి ద్వితీయోపదేశకాండము 5
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: ద్వితీయోపదేశకాండము 5:6-22
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు